Sunday 7 May 2017

అప'శ్వ'రము

ఏంటి, అప్పడానికి, తాపేశ్వరానికి సంకరంగా పుట్టిన పదంలా ఉంది కదూ. ఈ మధ్య జరిగిన సంభాషణలో శ యొక్క దుర్వినియోగ నిమిత్తమై ఈ పోస్టు మొదలుపెడుతున్నా.
ఇంతకీ విషయానికొస్తే, మన జీవితంలో మనకు తెలియకుండా ఇవ్వబడే అతి గొప్ప బహుమతులలో ఒకటి మన పేరు. అలాంటిది ఆ పేరునే సరిగ్గా పలకలేనప్పుడు రాయలేనప్పుడు మన మనస్సు చివుక్కుమంటుంది. ఇంతకన్నా విడ్డూరమేంటంటే ఖచ్చితమైన దాన్ని తప్పు అని చెప్పి తప్పును ఒప్పు చెయ్యడం. ఈ మధ్య నా తోటి స్నేహితుడు సురేష్ అని తన పేరుని తెలుగులో వింత వింత రంగులతో వ్రాసి వాట్సప్ ద్వారా ఒక గ్రూపులో పంపించాడు. నేను దానిని సరిదిద్ది అది సురేష్ కాదని సురేశ్ అని తిప్పి పంపగా ఆ గ్రూపులో ఉన్న మిగతా వారు నేనేదో అతనిని ఎగతాళి చేస్తున్నట్టుగా భావించి నా తనని ఆ పేరుతో ఎగతాళి చెయ్యడం మొదలు పెట్టారు. అప్పుడు మౌనమే నాకు శరణమయ్యింది. తదుపరి ఎక్కడ ష కనిపించినా శ వాడి వెటకారంతో తమ మూర్ఖత్వాన్ని తెలుపుకుంటూ వస్తున్నారు.

ఏది ఏమైనా, పేరు యొక్క పదప్రయోగాన్ని ఉత్పత్తిని పరిశీలిస్తే అసలు విషయం ఇట్టే తెలిసిపోతుంది. ఉదాహరణకు పైన ఉదహరించిన పేరుని తీసుకుందాం.

సురేశ్ - సుర + ఈశ్ (సురేష్ కాదు). అనగా స్వర్గానికి ఈశుడు(అధిపతి) అని.
అవినాశ్ - అ+వినాశ్(వినాశనం). ఇక్కడ వినాశనం అన్న పదాన్ని మనం సరిగానే వాడుతాం, వినాషనం అని బ్రష్ఠు పట్టించం కానీ సంధికొచ్చేసరికి దాన్ని నా'ష'నం గావిస్తాం.

అలాంటి మరి కొన్ని పేర్లు
ప్రాణేశ్, ముఖేశ్ మొదలైనవి.

ఐతే కొన్ని మినహాయింపులు క్రింద ఉదహరించబడినవి. వాటికి ఖచ్చితంగా ష వాదాలి.
సంతోష్, ప్రత్యూష్ మొదలైనవి.

ష ఉచ్చారణ అనేది సంస్కృత భాషా ప్రభావం. ఇది మనకు కొత్తేమీ కాదు. అందుకే కాబోలు గురజాడ వారు కన్యాశుల్కం ద్వారా ' అన్నీ వేదాల్లో ఉన్నాయ ' అని సంస్కృత ప్రభావాన్ని చమత్కరించారు. వాడుక సాధారణమైపోయినా తప్పుని వాడుతున్నామనీ, సరైన రూపం ఫలానా అని తెలియటం కూడా చాలా అవసరం అని నా అభిప్రాయం.   

Sunday 15 February 2015

తెలుగు వారు భావప్రియులా, భాషాభిమానులా?

ఈ మధ్య నాకెదురైన కొన్ని సంఘటనల సారమే ఈ ప్రశ్న అంకురార్పణకు మూలం.  నేను ఈ సరదాగా మరాఠీ నేర్చుకోవడం మొదలు పెట్టి, నాతో పనిచేసే వారితో మరాఠీ పదాలు వాడటం మొదలుపెట్టాను. ఆ వెర్రి వాళ్ళకు కూడా అంటింది కాబోలు తెలుగు నేర్పమని పట్టుపట్టారు.

ఇంగ్లీషులో  Hi, Hello, Good Morning లాగా మరాఠీలో ఎవరినైన కలిసినప్పుడు నమస్కార్ అని సంభోదిస్తారు. వాళ్ళు తెలుగులో ఏమంటారని అడిగారు. నేను 'నమస్కారం' అని చెప్పాను. ఇంతలో నాకో ఆలోచన. నిజంగా మనం ఎవరినైన కలిసినప్పుడు 'నమస్కారం' అని అనుకుంటామా? గురువుగారు, పెద్దవారు ఐతే తప్ప, ఈ సంభోధన సాధారనమైన వాడుక కాదు. మరి సాధారణంగా ఎవరినైన కలిసినప్పుడు ఏమని wish చేసుకుంటాము? ఒక వారం పాటు నా తోటి తెలుగువారు ఏమని సంభోదిస్తున్నారో గమనించాను. 'Hi, Hello, Good Morning. ఇదీ నా పరిశీలన ఫలితం.

అదే విధంగా నవీన పదాలకు మన పదాలు ఉన్నప్పటికీ కొన్ని పదాలు వాటి రూపాల్లోనే వాడుతుంటాము. ఉదాహరణకు "విమానాశ్రయం(సంసృతం) లేదా airport" అని  సంభోదిస్తాం. అదే హిందీలో 'విమాన్ మఠక్' అని వ్రాతలోనూ, 'హవాయి అడ్డా' అని వాడుకలోనూ వాడుతారు.విమానాశ్రయం వారి వాడుకలో ఉన్నప్పటికీ శుద్ధ హింది గా చెబుతారు(సంసృతాన్ని శుద్ధ హిందిగా వర్ణించే ప్రబుద్ధులు కొకొల్లలుగా కనిపిస్తారు లెండి).

అంకెల వ్రాతబడి మన తెలుగులో ఉన్నప్పటికీ ప్రపంచమంతా వాడుకలో ఉన్న అరబ్బుల సంకేతాలనే మనం వాడుతాం. ఉత్తరాదిన/ మహారాష్ట్రలో సాధారణంగా హిందీ అంకెలనే వాడుతారు. ఇక్కడి బస్ నంబర్లు, టికెట్ మీద అంకెలు, రోజువారీ సామాను ధరలు, చిట్టీలు జాబితాలు సమస్త సమాచారానికి వారి అంకెలే వాడుతారు. మీరనుకోవచ్చు అది భాషాభిమానం కావచ్చని. విచిత్రమేమంటే వాటి సాధారణ రూపాలను  ఇంకో ప్రక్కన కూడా వాడరు. హిందీ అంకెలు రాకపోతే అంతే మీకు లెఖ్ఖలు రానట్లే. ప్రభుత్వం వారు జారీ చేసే కరెంటు బిల్లులో కూడా మరాఠీ అంకెలు వాడటం, కేవలం మరాఠీలోనే అందిచడం(మనకు హింది/ఇంగ్లీషు లో కూడా ప్రింటు ఉంటుంది)  భాషాభిమానం లా అనిపించలేదు.

ఇవి మచ్చులు మాత్రమే, ఇంకా ఎన్నో ఊదాహరణలు నా మనసులో ఊగిసలాడుతున్నా, సమయాభావం, స్థలా భావం వల్ల వాటిని మరోసారి ఊదహరిస్తానని మనవిచేసుకుంటూ  సెలవు తీసుకుంటున్నా!!!

గమనిక : ఈ అన్వయం కేవలం వాడుక భాష ను ఉద్దేశించి మాత్రమే. ఈ అభిమానం వ్రాతభాషలో అభినందించదగినదని నా ఉద్దేశ్యం.

Friday 15 August 2014

వలపుల గిలక


పేరువినగానే వళ్ళు పులకరిస్తుందా! ఎదో వలపు తలపుకొస్తుందా! ఇంతకీ ఈ గిలకేమిటో దీనితో నాకు జరిగిన మెలికేమిటో చూద్దాం. ఈ మధ్య నేను పూనా నుండి ఇంటికి మా నాన్నగారితో రైలు బండిలో వెళ్తుండగా దారి మధ్యలో కర్నాటక దగ్గర ఒక వూరి పేరు చదువుతుండగా ఆ పేరు కొంత విచిత్రంగా అనిపించింది.
'ಚಿತ್ರಾವರ್ಣಂ(చిత్రావర్ణం)' దీని చదువినప్పుడు 'ర ' కారం తరువాత 'ణ ' కారం చదువుతారు, కాని వ్రాసినప్పుడు 'ణ ' కారం ముందు వ్రాసి  తరువాత 'ర ' కారం వ్రాస్తారు.  మామూలు సూత్రాలకు కొంత విరుద్ధంగా ఉండేసరికి మా నాన్న గారిని ఇలా అడిగేసాను మన తెలుగులో కూడా ఇలాంటి విరుద్ధాలు ఉన్నాయా అని. ఇంతలో ఆయన నవ్వుతూ తెలుగులో ఇలాంటి విరుద్ధాలు ప్రక్కన పెడితే, ఇదే విరుద్ధం మాత్రం ఖచ్చితంగా ఉందన్నారు. ఆశ్చర్యం నా వంతయింది. మనమెప్పుడూ ఇలాంటి వ్రాత చూసినట్టుగా లేదే అన్నాను. పూర్వం ఇలాంటి వ్రాత ప్రయోగం మన భాషలోనూ ఉందనీ కాల క్రమేణా మరుగున పడిపోయిందనీ, ఆ అక్షర ప్రక్రియని వలపుల గిలక అంటారనీ చెప్పారు. ఇది కేవలం 'ర ' కార ప్రయోగంలోనే వాడుతారట.
అదే కాకుండా సాధారణంగా తెలుగు, కన్నడ లిపులలో ద్విత్వాక్షరాలు వ్రాసినప్పుడు పూర్ణంగా ఉన్న అక్షరాన్ని పొల్లు/వత్తులతో వ్రాసి అస్ప్రష్టంగా పలికే అక్షరాన్ని పూర్తిగా వ్రాస్తాము. ఉదాహరణకు ఈ క్రింది పదాలను గమనించండి..

వర్ణం (vaRNAm)
చట్రం (chaTRAm)
పర్వం (paRVAm)
సత్వం (saTVAm)
వక్రం (vaKRAm)
త్వచం (TVAcham)
విప్లవం(viPLAvam)

ఇంగ్లీషు, హిందీ భాషలతో పోల్చి చూస్తే భేదం అర్ధమవుతుంది. ఇది ద్రవిడభాషా ప్రభావం కూడా కావచ్చు. తమిళ మలయాళ భాషలమీద నాకు అవగాహన లేదు. దీనికి సంబంధించిన సమాచారం మీ చెంత దాగుంటే అట్టే దాగనివ్వక ఇక్కడ పంచుకోగలరని మనవి.

Monday 30 June 2014

భార్యాభర్తలకి చిలకాగోరింకలకి ఉన్న సంబంధం ఏమిటి?

సాధారణంగా దంపతులను దీవించేటప్పుడు చిలుకాగోరింకల్లా కలకాలం వర్ధిల్లమని దీవిస్తారు. అలా ఎందుకు దీవిస్తారు, ఈ ధర్మ సందేహం నాది కాదు, మా వూరి అయ్యగారు ఒక వ్రతం చేయించే ముందు మా మెదడుకు కొంత మేత వేద్దామని అడిగిన ప్రశ్న ఇది. ఇక ఆశ్చర్యం నా వంతయింది, ఎందుకంటే ఇంతవరకు నాకెప్పుడూ రాలేదీ సందేహం, అలా అని వివరణ తెలుసా అంటే ఊహు, అదికూడా తెలియదాయె. మనం ఎన్నో పదాలు, జాతీయాలు వింటూ వాడుతూ ఉంటాం, కొన్నింటిని మూఢంగా అర్దం తెలియకుండా వాడేస్తుంటాం, అందులో చిలుకా గోరింక కూడా ఒకటి.

ఇక చిలుకా గోరింకల విషయానికొస్తే చిలకేమొ పచ్చగా ఉంటుంది, కోయిల నలుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. రెంటికీ పొంతనే లేదాయె, ఈ రెంటికి మధ్య సంబంధం ఎంత ఆలొచించినా నా మట్టి బుర్రకు స్ఫురించనేలేదు. దానికొక కారణంకూడా లేకపోలెదు, ఈ సినిమాలు కూడా మనల్ని తప్పు దారి పట్టించేసాయి. కోటయ్యగారు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక సినిమా తీసేసి నందిని కూడా సాధించారు. పాటల్లోనూ, మాటల్లోనూ ఏదో ఈ రెండూ ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేవేమో అన్న రీతిన చిత్రీకరించారు.

చివరికి తెలిసిందేమయ్యా అంటే చిలుకకు ఒక లక్షణం ఉంది, తన జత చిలుక తనకు దూరమైనప్పుడు ఒంటరిగానే బతుకుతుంది గానీ మరొక చిలుకను తోడు తెచ్చుకోదు, ఇంకో చిలుక వూసెత్తదు. ఇదే లక్షణం గోరింక జాతికి కూడా ఉందట. భార్యా భర్తలు కూడా కలకాలం ఒకరిమీదే పూర్తి మనస్సు నిమగ్నం చేసుకోవాలనీ, ఒకరికికోసం మరొకరు తమ జీవితాన్ని అంకితం చేసుకోవాలనే ఒక దృక్పథాన్ని  మనకు అందచెయ్యాలనే ఉద్దేశ్యంతో భార్యాభర్తల్ని కూడా కలకాలం చిలకల్లా, గోరింకల్లా ఒకరికోసం మరొకరన్న రీతిన నడుచుకోమని అలా దీవిస్తారట. ప్రాశ్చాత్య సంస్కృతికి దగ్గరవుతున్న నవీన సాంఘీక సమాజానికి ఈ జాతీయం ఒక హ్రాస్యస్పదం కూడా కావచ్చు.

Sunday 29 June 2014

శాలువా చేసుకున్న పాపమేమి బావా

విందుగాడు మా బావ. వాడికి తెలుగు మీద నాకు మించిన వెర్రి ఉంది. తెలుగు సాహిత్యం మీద, మన పురాణాలమీద చిత్ర విచిత్రమైన సందేహాలు కొకల్లలుగా వస్తుంటాయి. వాటిలో ఒకటి 'దుశ్శాలువ సందేహం'.
ఒకరోజు వాడు నాకు టెలిఫోన్ చేసి ఇలా అడిగాడు. 'బావా సాధారణంగా మనం 'దు ' అనే అక్షరాన్ని చెడుకు సంకేతంగా వాడుతాం కదా మరి ఎవరినైన సత్కరించేటప్పుడు దుశ్శాలువాతో సత్కరించారు అంటారే? శాలువా చేసుకున్న పాపమేమి బావా? ' అని.
నేను నలుగురైదుగురు ఉద్దండులైన పండితులనడిగి తెలుసుకున్న ఒక కథ వాడికి వినిపించి వాడి నోటికి ఆ నాటికి కళ్ళెం పడిపించా. అదే కథని ఇక్కడ పంచుకుంటున్నా.
శాలువా సంస్కారం భారతీయులకు కాశ్మీర దేశం నుండి దిగుమతి అయ్యింది. పూర్వం కాశ్మీర పండితులంటే మంచి విలువ ఉండేది, వారిని రెండు దుస్తులతో సత్కరించే అచారం ఉండేది. కాశ్మీరీ భాషలో రెండుని 'దు ' అంటారట(బహుశా సంసృతపు ద్వ మాతృపదం కావచ్చు) , శాలువా అంటె ఇక సరే సరి. రెండు దుస్తులతో సత్కరించడాన్ని దుశ్శాలువా అనడం పరిపాటి అయిపోయింది.

Saturday 28 June 2014

తటల సమర్ధన

శీర్షిక వింతగా ఉంది కదూ. నిన్న శుక్రవారం కదా మా ఉద్యోగుల మాటా బంతీ జరిగినప్పుడు ఒక మరాఠా ఆవిడకు తమిళులంటే మా చెడ్డ కోపమనీ, వాళ్ళు ఎప్పుడూ తమిళంలో మాట్లాడుకుంటారనీ, సాంబారు తింటారని అన్నీ వింత వింతగా చెబుతూ ఉంది. ఏదో నేనున్నాని తెలుగు వారిగురించి వింతగా చెఉప్పలేదేమో అనిపించింది నాకు. ఇంతలో తనదొక ధర్మ సందేహం. మీ దక్షినాది వారంత ఎందుకు త ని tha అని రాస్తారు అని. నాకైతే మా చెడ్డ కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా దక్షినాది వారు, వాళ్ళ భాష, వాళ్ళ తిండి, ఇంకో యావే లేదాయె.
ఇంతకీ వాదనకొస్తే లత, లలిత, సంగీత వంటి పేర్లలో మనం ఎక్కువగా tha వాడుతాం. ఉత్తరాదీయులు ta వాడుతారు. మీకెందుకు H అంటే అంత మక్కువ వ్యంగ్యంగా అడిగింది, క్రిందటి 'హెచ్చు ' వాదనను గుర్తు చేస్తూ. నేనేమీ ఊరకే ఉండకుండా ఇంక నా వాదనను అందుకున్నాను. వాళ్ళెందుకు అలా ta వాడుతారు, మరి 'త ' ని ఎలా వ్రాస్తారని అడిగితే ఆంగ్ల భాషలో రెండు లేవు కాబట్టి రెంటికీ ఒహటే వాడినా తప్పు లేదుట. నాకు భల్లున నవ్వొచ్చేసింది. కొంచెం ప్రాంతీయవాదన ప్రక్కన పెట్టి ఆలోచించమని నాకు తోచిన వాదనతో సమర్దించాను tha ప్రయోగాన్ని. భారతీయ భాషల్లో త, థ, ట మరియు ఠ అని నాలుగు అక్షరాలు ఉన్నాయి. అదే ఆంగ్ల భాషలో ta, tha అని రెండు అక్షరాలే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ రెంటికీ ఒకే అక్షరం వాడాల్సి వచ్చినప్పుడు రెండు తరచుగా వాడే అక్షరాలని ఒకే అక్షరంతో సూచించడం కన్నా రెండు వేరు వేరు అక్షరాలతో ఉపయోగించడం సులువు కదా అని. మరి ఠ ని ఎలా వ్రాస్తారు, థ ని ఎలా రాసారు. త, థ, ఠ మూదింటికీ tha వాడటం ఏమి న్యాయం, థ కి ta వాడతారా మరి అంటు వ్యంగ్యస్త్రాలని అందుకుంది. నాకు ఏనుగు లక్షమణ కవి తెనిగించిన ఒక సుభాషితం  గుర్తొచ్చి చల్లగా అక్కడినుండి జారుకున్నాను.    

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

Sunday 4 May 2014

హెచ్చుతో వచ్చిన తిప్పలు

మొదటిసారిగా తెలుగు గడ్డని వదిలి బయటకు వచ్చే ప్రతిఒక్కరికీ ఎదురయ్యే సంఘటనలలో ఇది ఒకటి.
ఆంగ్ల భాషా ఉచ్చారణలో మాతృభాషా ప్రభావం ప్రతిఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా తెలుగు వారికి కూడా కొన్ని అక్షరాల ఉచ్చారణలో ఈ ప్రభావం కనిపిస్తుంది. నేను మొదటిసారి ఉత్తరాది వారితో మాట్లాడేటప్పుడు, వారికి నా H ఉచ్చారణవింతగా అనిపించేది. సాధారణంగా మనకు ఆంగ్ల వర్ణమాల నేర్పించేటప్పుడు ఈ క్రింది అక్షరాలను తప్పుగా నేర్పిస్తారు.( ఇప్పటి కేంద్రీయ,అంతర్జాతీయ విద్యాలయాలలో విద్యా విధానంలో మార్పులు వచ్చాయి. ఇది కేవలం సాధారణ విద్యాలయాలను ఉదహరించి మాత్రమే).

H ని హెచ్ అని పలుకుతాము కాని ఇది ఎయ్చ్ అని పలకాలి. అసలు ఉచ్చారణలో హ రూపమే కనపడదు. కానీ మరో అక్షరంతో కూడి పదంగా మారినప్పుడు దాగివున్న 'హ ' శబ్దం తన ఉనికిని చూపిస్తుంది. ఉదాహరణకు HR ని ఎయ్చ్ ఆర్ అని పలకాలి, కాని Hat ని హాట్ అనే పలకాలి.

L, M, N ఈ మూడింటిని చాలామంది వరుసగా యం యల్, యన్ అని పలుకుతారు, కాని వీటిని ఎం, ఎల్, ఎన్ అని పలకాలి. ఉదాహరణకు HTML ని ఎయ్చ్ టి ఎం ఎల్ అని పలకాలి.

ఇక నా అనుభవానికి వస్తే, మొదటిసారి నాకీ అనుభవం ఎదురయినప్పుడు, నేను నమ్మలేకపోయాను. నాకొక గట్టినమ్మకం ఏమంటే రెండు ఉచ్చారణలూ సరైన ఉచ్చారణలు కావచ్చునని. అటకమీద పడిఉన్న ఒక పాత నిఘంటువుని తీసి వెతుకులాట మొదలుపెట్టాను. నా గట్టి నమ్మకానికి తిలోదకాలు ఇచ్చుకోవలసి వచ్చింది. నిజమే అతగాని పలుకుబడే నిజం, ఇది హెచ్ కాదు, ఎయ్చ్. ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోయాను కారణం ఈ విషయం నాకు మూడుపదుల వయసులో తెలియడమే. నాకు చదువు చెప్పిన టీచరయ్యలని, టీచరమ్మలని ఎదురు నిలబెట్టి కడిగెయ్యాలన్నంత కోపం. అసలు ఈ విషయం గురించి గూగులు మహా తల్లి ఏం చెబుతుందో చూద్దామని వెతికాను.  దొరికింది, ఇది కేవలం మన తెలుగు వారి బాధ కాదు, దక్షినాదివారంతా అనుభవించేదే, ఆ మాటికొస్తే ఫ్రాన్సు, మెక్సికో, ఇటలీ, దక్షిణమెరికా, ఆఫ్రిక, జెర్మను దేశాలలోని కొంతమంది ప్రజలు ఇలానే పలుకుతారట. 'హెచ్ ' ఉచ్చారణలో తప్పులేకపోయినప్పటికీ, 'ఎయ్చ్ ' అనిపలకటమే ఉత్తమమని తెలిసింది.

ఆంగ్ల పదాల ఉచ్చారణలో కూడా కొన్ని అనుభవాలను ఒక్కొక్కటిగా తరువాతి పోస్టులలో మీతో పంచుకుంటాను.


Related Posts Plugin for WordPress, Blogger...