Monday, 24 September 2012

తమిళులు అరవలైతే ......మరి అంధ్రులు???

మా స్నేహితుడు ఒకడు పై చదువుకోసమని మదరాసు వెళ్ళాడు(పది-పదిహేను సంవత్సరాలక్రితం మాట). తన స్నేహితులను అరవ మురుగేశన్, అరవ ప్రభాకరన్ అని పిలుచుకునేవాడు. అది విన్న ఒక తమిళతను ఒక పెద్ద గుంపుతో వచ్చి మనవాణ్ణి చితకబాదాడు. పాపం వీడికేం తెలుసు అర(సగం) వ(భాష)  అంటే తెలుగువారు తమిళులను హేళనగా పిలుచుకునే పదమని. మనకు ముప్ఫై ఏడుకు పైచిలుకు హల్లులుంటే వారికి సగం అంటే పద్దెనిమిది హల్లులు మాత్రమే ఉన్నందున, వారిది సగం భాషగా కొందరు మూర్ఖ పూర్వీకులు వారిని అవహేళన చేసేవారు. కానీ ఇప్పుడు మన భాషకూడా అరవై నుండి నలభైకి పడిపోయి  అరవ భాషగా మారిపోతూ వస్తోంది.  అక్షరాలెన్నైతే ఏంటి, భావం ముఖ్యం గాని అనే ఛాందసులూ   లేకపోలేదు, కాకపోతే వారికోసం ఈ చర్చను వేరే గతంలో మొదలుపెడతాను. ఇంతకూ ఈ గతానికొస్తే మా వాడికి దెబ్బలు తిన్న మరుక్షణమే ఒక  ధర్మ సందేహం వచ్చింది. వాళ్ళను ఇలా హేళన చేస్తున్నాం కదా, మరి వాళ్ళు కూడా ఏదో పేరుతో మనను హేళన చెయ్యకపోరు. మరి ఆ పదం ఏమయ్యుంటుంది..ఎలా  తెలుసుకోవడం అని తీవ్ర పరిశోధన చేసి చివరికి ఒక పదమైతే తెలుసుకున్నాడు. 
తమిళులు అరవలైతే ...... అంధ్రులు గుల్టీలు/గుల్తీలు (Telugu in reverse) అని....
(కేవలం సమాచార నిమిత్తమే గానీ ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం కాదని మనవి.) 

Saturday, 22 September 2012

నా స్వగతానికి స్వాగతం

పేరు చంద్రశేఖరం. తెలుగంటే పిచ్చి , తెలుగు వారంటే వెర్రి. తెలుగుభాషను ఉద్ధరించి తెలుగు ఖ్యాతిని ప్రపంచపు నలుమూలలా వ్యాపింపచేయాలని కలలు కన్న వారిలో నేనొకడిని(కేవలం కలలు మాత్రమేనండోయ్, వాటికే సమయం సరిపోవడం లేదిక్కడ). మన రాష్త్రం వదిలి బయటకు వస్తే గానీ తెలియలేదు మాతృభాష/మాతృభూమి విలువ. ఎన్నోసార్లు నాకున్న భావాలనూ, అభిప్రాయాలను సంతోషాలను స్నేహితులతో పాలుపంచుకోవాలనిపించేది. కానీ ఏది ఎటు చూసినా ఆంధ్ర ఆవకాయ వాసనే రాదు. ఎప్పుడో ఒకప్పుడు చుట్టపుచూపుగా ఎవరో ఒకరు కలుస్తారు కానీ అయినా ఏదో తెలియని అసంతృప్తి.  అందుకే బ్లాగోగులతో ఈ బ్లాగుని నింపుకుందామని నేను మొదలు పెట్టేశా.  ఇందులో ఎక్కువగా నా గతాన్నే ఉద్దేశించే రాయొచ్చు. ప్రాస మీద అంతగా అభిమానం లేకపోయినా ఎప్పుడో చిన్నప్పుడు చదివిన ప్రవరుని స్వగతం గుర్తొచ్చి దాన్ని 'చంద్రుని స్వగతం' గా మార్చేసి నా డైరీ కి శీర్షిక పెట్టేసుకున్నా. 
ధన్యవాదములు
మీ చంద్రం
Related Posts Plugin for WordPress, Blogger...