సాధారణంగా దంపతులను దీవించేటప్పుడు చిలుకాగోరింకల్లా కలకాలం వర్ధిల్లమని దీవిస్తారు. అలా ఎందుకు దీవిస్తారు, ఈ ధర్మ సందేహం నాది కాదు, మా వూరి అయ్యగారు ఒక వ్రతం చేయించే ముందు మా మెదడుకు కొంత మేత వేద్దామని అడిగిన ప్రశ్న ఇది. ఇక ఆశ్చర్యం నా వంతయింది, ఎందుకంటే ఇంతవరకు నాకెప్పుడూ రాలేదీ సందేహం, అలా అని వివరణ తెలుసా అంటే ఊహు, అదికూడా తెలియదాయె. మనం ఎన్నో పదాలు, జాతీయాలు వింటూ వాడుతూ ఉంటాం, కొన్నింటిని మూఢంగా అర్దం తెలియకుండా వాడేస్తుంటాం, అందులో చిలుకా గోరింక కూడా ఒకటి.
ఇక చిలుకా గోరింకల విషయానికొస్తే చిలకేమొ పచ్చగా ఉంటుంది, కోయిల నలుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. రెంటికీ పొంతనే లేదాయె, ఈ రెంటికి మధ్య సంబంధం ఎంత ఆలొచించినా నా మట్టి బుర్రకు స్ఫురించనేలేదు. దానికొక కారణంకూడా లేకపోలెదు, ఈ సినిమాలు కూడా మనల్ని తప్పు దారి పట్టించేసాయి. కోటయ్యగారు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక సినిమా తీసేసి నందిని కూడా సాధించారు. పాటల్లోనూ, మాటల్లోనూ ఏదో ఈ రెండూ ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేవేమో అన్న రీతిన చిత్రీకరించారు.
చివరికి తెలిసిందేమయ్యా అంటే చిలుకకు ఒక లక్షణం ఉంది, తన జత చిలుక తనకు దూరమైనప్పుడు ఒంటరిగానే బతుకుతుంది గానీ మరొక చిలుకను తోడు తెచ్చుకోదు, ఇంకో చిలుక వూసెత్తదు. ఇదే లక్షణం గోరింక జాతికి కూడా ఉందట. భార్యా భర్తలు కూడా కలకాలం ఒకరిమీదే పూర్తి మనస్సు నిమగ్నం చేసుకోవాలనీ, ఒకరికికోసం మరొకరు తమ జీవితాన్ని అంకితం చేసుకోవాలనే ఒక దృక్పథాన్ని మనకు అందచెయ్యాలనే ఉద్దేశ్యంతో భార్యాభర్తల్ని కూడా కలకాలం చిలకల్లా, గోరింకల్లా ఒకరికోసం మరొకరన్న రీతిన నడుచుకోమని అలా దీవిస్తారట. ప్రాశ్చాత్య సంస్కృతికి దగ్గరవుతున్న నవీన సాంఘీక సమాజానికి ఈ జాతీయం ఒక హ్రాస్యస్పదం కూడా కావచ్చు.
No comments:
Post a Comment