Friday, 15 August 2014
వలపుల గిలక
పేరువినగానే వళ్ళు పులకరిస్తుందా! ఎదో వలపు తలపుకొస్తుందా! ఇంతకీ ఈ గిలకేమిటో దీనితో నాకు జరిగిన మెలికేమిటో చూద్దాం. ఈ మధ్య నేను పూనా నుండి ఇంటికి మా నాన్నగారితో రైలు బండిలో వెళ్తుండగా దారి మధ్యలో కర్నాటక దగ్గర ఒక వూరి పేరు చదువుతుండగా ఆ పేరు కొంత విచిత్రంగా అనిపించింది.
'ಚಿತ್ರಾವರ್ಣಂ(చిత్రావర్ణం)' దీని చదువినప్పుడు 'ర ' కారం తరువాత 'ణ ' కారం చదువుతారు, కాని వ్రాసినప్పుడు 'ణ ' కారం ముందు వ్రాసి తరువాత 'ర ' కారం వ్రాస్తారు. మామూలు సూత్రాలకు కొంత విరుద్ధంగా ఉండేసరికి మా నాన్న గారిని ఇలా అడిగేసాను మన తెలుగులో కూడా ఇలాంటి విరుద్ధాలు ఉన్నాయా అని. ఇంతలో ఆయన నవ్వుతూ తెలుగులో ఇలాంటి విరుద్ధాలు ప్రక్కన పెడితే, ఇదే విరుద్ధం మాత్రం ఖచ్చితంగా ఉందన్నారు. ఆశ్చర్యం నా వంతయింది. మనమెప్పుడూ ఇలాంటి వ్రాత చూసినట్టుగా లేదే అన్నాను. పూర్వం ఇలాంటి వ్రాత ప్రయోగం మన భాషలోనూ ఉందనీ కాల క్రమేణా మరుగున పడిపోయిందనీ, ఆ అక్షర ప్రక్రియని వలపుల గిలక అంటారనీ చెప్పారు. ఇది కేవలం 'ర ' కార ప్రయోగంలోనే వాడుతారట.
అదే కాకుండా సాధారణంగా తెలుగు, కన్నడ లిపులలో ద్విత్వాక్షరాలు వ్రాసినప్పుడు పూర్ణంగా ఉన్న అక్షరాన్ని పొల్లు/వత్తులతో వ్రాసి అస్ప్రష్టంగా పలికే అక్షరాన్ని పూర్తిగా వ్రాస్తాము. ఉదాహరణకు ఈ క్రింది పదాలను గమనించండి..
వర్ణం (vaRNAm)
చట్రం (chaTRAm)
పర్వం (paRVAm)
సత్వం (saTVAm)
వక్రం (vaKRAm)
త్వచం (TVAcham)
విప్లవం(viPLAvam)
ఇంగ్లీషు, హిందీ భాషలతో పోల్చి చూస్తే భేదం అర్ధమవుతుంది. ఇది ద్రవిడభాషా ప్రభావం కూడా కావచ్చు. తమిళ మలయాళ భాషలమీద నాకు అవగాహన లేదు. దీనికి సంబంధించిన సమాచారం మీ చెంత దాగుంటే అట్టే దాగనివ్వక ఇక్కడ పంచుకోగలరని మనవి.
Subscribe to:
Comments (Atom)