ఈ మధ్య నాకెదురైన కొన్ని సంఘటనల సారమే ఈ ప్రశ్న అంకురార్పణకు మూలం. నేను ఈ సరదాగా మరాఠీ నేర్చుకోవడం మొదలు పెట్టి, నాతో పనిచేసే వారితో మరాఠీ పదాలు వాడటం మొదలుపెట్టాను. ఆ వెర్రి వాళ్ళకు కూడా అంటింది కాబోలు తెలుగు నేర్పమని పట్టుపట్టారు.
ఇంగ్లీషులో Hi, Hello, Good Morning లాగా మరాఠీలో ఎవరినైన కలిసినప్పుడు నమస్కార్ అని సంభోదిస్తారు. వాళ్ళు తెలుగులో ఏమంటారని అడిగారు. నేను 'నమస్కారం' అని చెప్పాను. ఇంతలో నాకో ఆలోచన. నిజంగా మనం ఎవరినైన కలిసినప్పుడు 'నమస్కారం' అని అనుకుంటామా? గురువుగారు, పెద్దవారు ఐతే తప్ప, ఈ సంభోధన సాధారనమైన వాడుక కాదు. మరి సాధారణంగా ఎవరినైన కలిసినప్పుడు ఏమని wish చేసుకుంటాము? ఒక వారం పాటు నా తోటి తెలుగువారు ఏమని సంభోదిస్తున్నారో గమనించాను. 'Hi, Hello, Good Morning. ఇదీ నా పరిశీలన ఫలితం.
అదే విధంగా నవీన పదాలకు మన పదాలు ఉన్నప్పటికీ కొన్ని పదాలు వాటి రూపాల్లోనే వాడుతుంటాము. ఉదాహరణకు "విమానాశ్రయం(సంసృతం) లేదా airport" అని సంభోదిస్తాం. అదే హిందీలో 'విమాన్ మఠక్' అని వ్రాతలోనూ, 'హవాయి అడ్డా' అని వాడుకలోనూ వాడుతారు.విమానాశ్రయం వారి వాడుకలో ఉన్నప్పటికీ శుద్ధ హింది గా చెబుతారు(సంసృతాన్ని శుద్ధ హిందిగా వర్ణించే ప్రబుద్ధులు కొకొల్లలుగా కనిపిస్తారు లెండి).
అంకెల వ్రాతబడి మన తెలుగులో ఉన్నప్పటికీ ప్రపంచమంతా వాడుకలో ఉన్న అరబ్బుల సంకేతాలనే మనం వాడుతాం. ఉత్తరాదిన/ మహారాష్ట్రలో సాధారణంగా హిందీ అంకెలనే వాడుతారు. ఇక్కడి బస్ నంబర్లు, టికెట్ మీద అంకెలు, రోజువారీ సామాను ధరలు, చిట్టీలు జాబితాలు సమస్త సమాచారానికి వారి అంకెలే వాడుతారు. మీరనుకోవచ్చు అది భాషాభిమానం కావచ్చని. విచిత్రమేమంటే వాటి సాధారణ రూపాలను ఇంకో ప్రక్కన కూడా వాడరు. హిందీ అంకెలు రాకపోతే అంతే మీకు లెఖ్ఖలు రానట్లే. ప్రభుత్వం వారు జారీ చేసే కరెంటు బిల్లులో కూడా మరాఠీ అంకెలు వాడటం, కేవలం మరాఠీలోనే అందిచడం(మనకు హింది/ఇంగ్లీషు లో కూడా ప్రింటు ఉంటుంది) భాషాభిమానం లా అనిపించలేదు.
ఇవి మచ్చులు మాత్రమే, ఇంకా ఎన్నో ఊదాహరణలు నా మనసులో ఊగిసలాడుతున్నా, సమయాభావం, స్థలా భావం వల్ల వాటిని మరోసారి ఊదహరిస్తానని మనవిచేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా!!!
గమనిక : ఈ అన్వయం కేవలం వాడుక భాష ను ఉద్దేశించి మాత్రమే. ఈ అభిమానం వ్రాతభాషలో అభినందించదగినదని నా ఉద్దేశ్యం.