Friday, 15 August 2014

వలపుల గిలక


పేరువినగానే వళ్ళు పులకరిస్తుందా! ఎదో వలపు తలపుకొస్తుందా! ఇంతకీ ఈ గిలకేమిటో దీనితో నాకు జరిగిన మెలికేమిటో చూద్దాం. ఈ మధ్య నేను పూనా నుండి ఇంటికి మా నాన్నగారితో రైలు బండిలో వెళ్తుండగా దారి మధ్యలో కర్నాటక దగ్గర ఒక వూరి పేరు చదువుతుండగా ఆ పేరు కొంత విచిత్రంగా అనిపించింది.
'ಚಿತ್ರಾವರ್ಣಂ(చిత్రావర్ణం)' దీని చదువినప్పుడు 'ర ' కారం తరువాత 'ణ ' కారం చదువుతారు, కాని వ్రాసినప్పుడు 'ణ ' కారం ముందు వ్రాసి  తరువాత 'ర ' కారం వ్రాస్తారు.  మామూలు సూత్రాలకు కొంత విరుద్ధంగా ఉండేసరికి మా నాన్న గారిని ఇలా అడిగేసాను మన తెలుగులో కూడా ఇలాంటి విరుద్ధాలు ఉన్నాయా అని. ఇంతలో ఆయన నవ్వుతూ తెలుగులో ఇలాంటి విరుద్ధాలు ప్రక్కన పెడితే, ఇదే విరుద్ధం మాత్రం ఖచ్చితంగా ఉందన్నారు. ఆశ్చర్యం నా వంతయింది. మనమెప్పుడూ ఇలాంటి వ్రాత చూసినట్టుగా లేదే అన్నాను. పూర్వం ఇలాంటి వ్రాత ప్రయోగం మన భాషలోనూ ఉందనీ కాల క్రమేణా మరుగున పడిపోయిందనీ, ఆ అక్షర ప్రక్రియని వలపుల గిలక అంటారనీ చెప్పారు. ఇది కేవలం 'ర ' కార ప్రయోగంలోనే వాడుతారట.
అదే కాకుండా సాధారణంగా తెలుగు, కన్నడ లిపులలో ద్విత్వాక్షరాలు వ్రాసినప్పుడు పూర్ణంగా ఉన్న అక్షరాన్ని పొల్లు/వత్తులతో వ్రాసి అస్ప్రష్టంగా పలికే అక్షరాన్ని పూర్తిగా వ్రాస్తాము. ఉదాహరణకు ఈ క్రింది పదాలను గమనించండి..

వర్ణం (vaRNAm)
చట్రం (chaTRAm)
పర్వం (paRVAm)
సత్వం (saTVAm)
వక్రం (vaKRAm)
త్వచం (TVAcham)
విప్లవం(viPLAvam)

ఇంగ్లీషు, హిందీ భాషలతో పోల్చి చూస్తే భేదం అర్ధమవుతుంది. ఇది ద్రవిడభాషా ప్రభావం కూడా కావచ్చు. తమిళ మలయాళ భాషలమీద నాకు అవగాహన లేదు. దీనికి సంబంధించిన సమాచారం మీ చెంత దాగుంటే అట్టే దాగనివ్వక ఇక్కడ పంచుకోగలరని మనవి.

Monday, 30 June 2014

భార్యాభర్తలకి చిలకాగోరింకలకి ఉన్న సంబంధం ఏమిటి?

సాధారణంగా దంపతులను దీవించేటప్పుడు చిలుకాగోరింకల్లా కలకాలం వర్ధిల్లమని దీవిస్తారు. అలా ఎందుకు దీవిస్తారు, ఈ ధర్మ సందేహం నాది కాదు, మా వూరి అయ్యగారు ఒక వ్రతం చేయించే ముందు మా మెదడుకు కొంత మేత వేద్దామని అడిగిన ప్రశ్న ఇది. ఇక ఆశ్చర్యం నా వంతయింది, ఎందుకంటే ఇంతవరకు నాకెప్పుడూ రాలేదీ సందేహం, అలా అని వివరణ తెలుసా అంటే ఊహు, అదికూడా తెలియదాయె. మనం ఎన్నో పదాలు, జాతీయాలు వింటూ వాడుతూ ఉంటాం, కొన్నింటిని మూఢంగా అర్దం తెలియకుండా వాడేస్తుంటాం, అందులో చిలుకా గోరింక కూడా ఒకటి.

ఇక చిలుకా గోరింకల విషయానికొస్తే చిలకేమొ పచ్చగా ఉంటుంది, కోయిల నలుపు రంగులో నిగనిగలాడుతూ ఉంటుంది. రెంటికీ పొంతనే లేదాయె, ఈ రెంటికి మధ్య సంబంధం ఎంత ఆలొచించినా నా మట్టి బుర్రకు స్ఫురించనేలేదు. దానికొక కారణంకూడా లేకపోలెదు, ఈ సినిమాలు కూడా మనల్ని తప్పు దారి పట్టించేసాయి. కోటయ్యగారు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఒక సినిమా తీసేసి నందిని కూడా సాధించారు. పాటల్లోనూ, మాటల్లోనూ ఏదో ఈ రెండూ ఒకదాన్ని విడిచి మరొకటి ఉండలేవేమో అన్న రీతిన చిత్రీకరించారు.

చివరికి తెలిసిందేమయ్యా అంటే చిలుకకు ఒక లక్షణం ఉంది, తన జత చిలుక తనకు దూరమైనప్పుడు ఒంటరిగానే బతుకుతుంది గానీ మరొక చిలుకను తోడు తెచ్చుకోదు, ఇంకో చిలుక వూసెత్తదు. ఇదే లక్షణం గోరింక జాతికి కూడా ఉందట. భార్యా భర్తలు కూడా కలకాలం ఒకరిమీదే పూర్తి మనస్సు నిమగ్నం చేసుకోవాలనీ, ఒకరికికోసం మరొకరు తమ జీవితాన్ని అంకితం చేసుకోవాలనే ఒక దృక్పథాన్ని  మనకు అందచెయ్యాలనే ఉద్దేశ్యంతో భార్యాభర్తల్ని కూడా కలకాలం చిలకల్లా, గోరింకల్లా ఒకరికోసం మరొకరన్న రీతిన నడుచుకోమని అలా దీవిస్తారట. ప్రాశ్చాత్య సంస్కృతికి దగ్గరవుతున్న నవీన సాంఘీక సమాజానికి ఈ జాతీయం ఒక హ్రాస్యస్పదం కూడా కావచ్చు.

Sunday, 29 June 2014

శాలువా చేసుకున్న పాపమేమి బావా

విందుగాడు మా బావ. వాడికి తెలుగు మీద నాకు మించిన వెర్రి ఉంది. తెలుగు సాహిత్యం మీద, మన పురాణాలమీద చిత్ర విచిత్రమైన సందేహాలు కొకల్లలుగా వస్తుంటాయి. వాటిలో ఒకటి 'దుశ్శాలువ సందేహం'.
ఒకరోజు వాడు నాకు టెలిఫోన్ చేసి ఇలా అడిగాడు. 'బావా సాధారణంగా మనం 'దు ' అనే అక్షరాన్ని చెడుకు సంకేతంగా వాడుతాం కదా మరి ఎవరినైన సత్కరించేటప్పుడు దుశ్శాలువాతో సత్కరించారు అంటారే? శాలువా చేసుకున్న పాపమేమి బావా? ' అని.
నేను నలుగురైదుగురు ఉద్దండులైన పండితులనడిగి తెలుసుకున్న ఒక కథ వాడికి వినిపించి వాడి నోటికి ఆ నాటికి కళ్ళెం పడిపించా. అదే కథని ఇక్కడ పంచుకుంటున్నా.
శాలువా సంస్కారం భారతీయులకు కాశ్మీర దేశం నుండి దిగుమతి అయ్యింది. పూర్వం కాశ్మీర పండితులంటే మంచి విలువ ఉండేది, వారిని రెండు దుస్తులతో సత్కరించే అచారం ఉండేది. కాశ్మీరీ భాషలో రెండుని 'దు ' అంటారట(బహుశా సంసృతపు ద్వ మాతృపదం కావచ్చు) , శాలువా అంటె ఇక సరే సరి. రెండు దుస్తులతో సత్కరించడాన్ని దుశ్శాలువా అనడం పరిపాటి అయిపోయింది.

Saturday, 28 June 2014

తటల సమర్ధన

శీర్షిక వింతగా ఉంది కదూ. నిన్న శుక్రవారం కదా మా ఉద్యోగుల మాటా బంతీ జరిగినప్పుడు ఒక మరాఠా ఆవిడకు తమిళులంటే మా చెడ్డ కోపమనీ, వాళ్ళు ఎప్పుడూ తమిళంలో మాట్లాడుకుంటారనీ, సాంబారు తింటారని అన్నీ వింత వింతగా చెబుతూ ఉంది. ఏదో నేనున్నాని తెలుగు వారిగురించి వింతగా చెఉప్పలేదేమో అనిపించింది నాకు. ఇంతలో తనదొక ధర్మ సందేహం. మీ దక్షినాది వారంత ఎందుకు త ని tha అని రాస్తారు అని. నాకైతే మా చెడ్డ కోపం వచ్చింది. ఎప్పుడు చూసినా దక్షినాది వారు, వాళ్ళ భాష, వాళ్ళ తిండి, ఇంకో యావే లేదాయె.
ఇంతకీ వాదనకొస్తే లత, లలిత, సంగీత వంటి పేర్లలో మనం ఎక్కువగా tha వాడుతాం. ఉత్తరాదీయులు ta వాడుతారు. మీకెందుకు H అంటే అంత మక్కువ వ్యంగ్యంగా అడిగింది, క్రిందటి 'హెచ్చు ' వాదనను గుర్తు చేస్తూ. నేనేమీ ఊరకే ఉండకుండా ఇంక నా వాదనను అందుకున్నాను. వాళ్ళెందుకు అలా ta వాడుతారు, మరి 'త ' ని ఎలా వ్రాస్తారని అడిగితే ఆంగ్ల భాషలో రెండు లేవు కాబట్టి రెంటికీ ఒహటే వాడినా తప్పు లేదుట. నాకు భల్లున నవ్వొచ్చేసింది. కొంచెం ప్రాంతీయవాదన ప్రక్కన పెట్టి ఆలోచించమని నాకు తోచిన వాదనతో సమర్దించాను tha ప్రయోగాన్ని. భారతీయ భాషల్లో త, థ, ట మరియు ఠ అని నాలుగు అక్షరాలు ఉన్నాయి. అదే ఆంగ్ల భాషలో ta, tha అని రెండు అక్షరాలే ఉన్నాయి. కాబట్టి ఒకవేళ రెంటికీ ఒకే అక్షరం వాడాల్సి వచ్చినప్పుడు రెండు తరచుగా వాడే అక్షరాలని ఒకే అక్షరంతో సూచించడం కన్నా రెండు వేరు వేరు అక్షరాలతో ఉపయోగించడం సులువు కదా అని. మరి ఠ ని ఎలా వ్రాస్తారు, థ ని ఎలా రాసారు. త, థ, ఠ మూదింటికీ tha వాడటం ఏమి న్యాయం, థ కి ta వాడతారా మరి అంటు వ్యంగ్యస్త్రాలని అందుకుంది. నాకు ఏనుగు లక్షమణ కవి తెనిగించిన ఒక సుభాషితం  గుర్తొచ్చి చల్లగా అక్కడినుండి జారుకున్నాను.    

తివిరి యిసుమున తైలంబు దీయవచ్చు
దవిలి మృగతృష్ణ లో నీరు ద్రావవచ్చు
తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు
చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు

Sunday, 4 May 2014

హెచ్చుతో వచ్చిన తిప్పలు

మొదటిసారిగా తెలుగు గడ్డని వదిలి బయటకు వచ్చే ప్రతిఒక్కరికీ ఎదురయ్యే సంఘటనలలో ఇది ఒకటి.
ఆంగ్ల భాషా ఉచ్చారణలో మాతృభాషా ప్రభావం ప్రతిఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా తెలుగు వారికి కూడా కొన్ని అక్షరాల ఉచ్చారణలో ఈ ప్రభావం కనిపిస్తుంది. నేను మొదటిసారి ఉత్తరాది వారితో మాట్లాడేటప్పుడు, వారికి నా H ఉచ్చారణవింతగా అనిపించేది. సాధారణంగా మనకు ఆంగ్ల వర్ణమాల నేర్పించేటప్పుడు ఈ క్రింది అక్షరాలను తప్పుగా నేర్పిస్తారు.( ఇప్పటి కేంద్రీయ,అంతర్జాతీయ విద్యాలయాలలో విద్యా విధానంలో మార్పులు వచ్చాయి. ఇది కేవలం సాధారణ విద్యాలయాలను ఉదహరించి మాత్రమే).

H ని హెచ్ అని పలుకుతాము కాని ఇది ఎయ్చ్ అని పలకాలి. అసలు ఉచ్చారణలో హ రూపమే కనపడదు. కానీ మరో అక్షరంతో కూడి పదంగా మారినప్పుడు దాగివున్న 'హ ' శబ్దం తన ఉనికిని చూపిస్తుంది. ఉదాహరణకు HR ని ఎయ్చ్ ఆర్ అని పలకాలి, కాని Hat ని హాట్ అనే పలకాలి.

L, M, N ఈ మూడింటిని చాలామంది వరుసగా యం యల్, యన్ అని పలుకుతారు, కాని వీటిని ఎం, ఎల్, ఎన్ అని పలకాలి. ఉదాహరణకు HTML ని ఎయ్చ్ టి ఎం ఎల్ అని పలకాలి.

ఇక నా అనుభవానికి వస్తే, మొదటిసారి నాకీ అనుభవం ఎదురయినప్పుడు, నేను నమ్మలేకపోయాను. నాకొక గట్టినమ్మకం ఏమంటే రెండు ఉచ్చారణలూ సరైన ఉచ్చారణలు కావచ్చునని. అటకమీద పడిఉన్న ఒక పాత నిఘంటువుని తీసి వెతుకులాట మొదలుపెట్టాను. నా గట్టి నమ్మకానికి తిలోదకాలు ఇచ్చుకోవలసి వచ్చింది. నిజమే అతగాని పలుకుబడే నిజం, ఇది హెచ్ కాదు, ఎయ్చ్. ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోయాను కారణం ఈ విషయం నాకు మూడుపదుల వయసులో తెలియడమే. నాకు చదువు చెప్పిన టీచరయ్యలని, టీచరమ్మలని ఎదురు నిలబెట్టి కడిగెయ్యాలన్నంత కోపం. అసలు ఈ విషయం గురించి గూగులు మహా తల్లి ఏం చెబుతుందో చూద్దామని వెతికాను.  దొరికింది, ఇది కేవలం మన తెలుగు వారి బాధ కాదు, దక్షినాదివారంతా అనుభవించేదే, ఆ మాటికొస్తే ఫ్రాన్సు, మెక్సికో, ఇటలీ, దక్షిణమెరికా, ఆఫ్రిక, జెర్మను దేశాలలోని కొంతమంది ప్రజలు ఇలానే పలుకుతారట. 'హెచ్ ' ఉచ్చారణలో తప్పులేకపోయినప్పటికీ, 'ఎయ్చ్ ' అనిపలకటమే ఉత్తమమని తెలిసింది.

ఆంగ్ల పదాల ఉచ్చారణలో కూడా కొన్ని అనుభవాలను ఒక్కొక్కటిగా తరువాతి పోస్టులలో మీతో పంచుకుంటాను.


Friday, 2 May 2014

మరచిన అక్షరం-పోయిన పరువు

ఒకప్పుడు భాషా పండితులకు ఇతర భాషలమీద కూడా పరిఙానం ఉండాలనే ఉద్దేశ్యంతో మన ప్రభుత్వం ఒక తీర్మానం చేసింది. పరాయిరాష్త్రం వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఒక  పరాయి భాషను నేర్చుకోవాలని( ఆ సంవత్సరం పాటు జీతం ఇస్తూ, పాఠాలను బోధించే ఉత్తమ అధ్యాపకులను కూడా నియమించేది. గొప్ప నిర్ణయం కదూ!!!). దీనిలో భాగంగా మా నాన్నగారు కూడా మైసూరు వెళ్ళి తమిళభాషను ఎంచుకున్నారు. ఒకరోజు ఒక తమిళ అధ్యాపకులు పాఠ్యాంశంలో భాగంగా తమిళ భాష గొప్పతనాన్ని వర్ణిస్తూ zha అక్షరం ద్రావిడభాషల్లోనే గొప్పదని, అది భాషకు వన్నె తెస్తుందని తమిళ, మలయాళ భాషల్లో తప్ప మరేయితర ద్రావిడ భాషల్లో లేదని వ్యంగంగా తెలుగుని కించపరుస్తూ మాట్లాడుతున్నారుట. ఇంతలో మా నాన్నగారు లేచి ఈ అక్షరం తెలుగులో కూడా ఉందని, నన్నయ్య తన భారత రచనలో వాడారని, ఒక పద్యాన్ని ఉదాహరణగా జోడించారట. అది విన్న తోటి తెలుగువారు హేళన చేస్తూ చాదస్తపు పంతులు సంస్కృతాక్షరానికి భష్టరూపం ఇచ్చి, ఎదో మాట్లాడుతున్నారని అది నిజం కాదని వాదన వేసుకున్నారట. ఆ అధ్యాపకులవారు తరువాతి రోజు తరగతి గదిలోకి వచ్చి, తను గ్రంథాలయంలో నిన్న చెప్పిన పద్యం గురించి శోధించానని, అది నిజమేనని, ఈ అక్షరం అన్ని ద్రావిడ భాషలలో ఉండవచ్చునని తప్పుని మన్నించమని క్షమాపణ చెప్పారట. నాకైతే భలే వింతగా అనిపించిందీ సంఘటన. ఎందుకంటే ఈ మధ్యే ఒక పెద్దాయన తెలుగులో ఒక ముప్పైకి పైగా అక్షరాలు వ్యర్థమని కేవలం తమ భాషకు 25 అక్షరాలు సరిపోతాయని వింత ప్రచారాలు చేస్తున్నారు ఆ సంగతులను నా తరువాతి బ్లాగులో చర్చిస్తాను. సెలవా మరి!!! 

Thursday, 1 May 2014

తెలుగులో అక్షరాలెన్ని, నిజంగా యాభైయారేనా?

మొన్న ఒక పాతకాలపు ఉత్తరాది వ్యక్తిని కలిసాను, మా చర్చలో అయాచితంగా నా అంతరంగంలో ఉండే తెలుగు బయటపడి తనలో ఒక ధర్మసందేహానికి తావునిచ్చింది, తెలుగులో అక్షరాలు యాభై ఆరు కదూ అని. తనే పాటలోనో, పాఠాల్లోనో వినుండచ్చు అనుకొని అవునని తలూపాను, కానీ మనసులో అదో తెలియని భయం, ఆ యాభై ఆరు ఎక్కడ వల్లించమంటాడో అని. నా భయం వ్యర్థం కాకూడదని అనుకున్నాడో ఏమో, అప్పటికప్పుడు యాభైయారు అక్షారాలు చెప్పమని పట్టుపట్టాడు, చివరికి చెప్పక తప్పలేదు. నా లెక్కింపు ఇలా మొదలైంది,
అచ్చులు 16  - అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ,అలు,అలూ,ఋ,ౠ, ఎ, ఏ, ఐ, ఒ, ఓ ఔ
హల్లులు 40 -  క వర్గం(5), చ వర్గం(5), ట వర్గం(5), త వర్గం(5) ప వర్గం(5), య, ర, ల, వ, శ, ష, స, హ,ళ, క్ష, ఱ(11)

లెఖ్ఖ తప్పింది కదూ, ఇంతా కష్టపడితే 36 హల్లులే వచ్చాయి, కొంచెం దీర్ఘాలోచన చేసి జ్+అ(జాబిల్లి లో జా) , చ్+అ(చందమామ లో .చ చిత్రం )  అని రెండు మృతాక్షరాలను గుర్తు తెచ్చుకున్నాను. ఇంకా 2 అక్షరాలు కావల్సి వచ్చింది. ఆ గండంలో నుండి బయట పడటానికి సున్న అరసున్న, విసర్గలను కలిపి చెప్పాను. (ఇవి నాసికాక్షరాలు మాత్రమే, తెలుగు అక్షరాల లెక్కలో చేరవు, కేవలం గండం నుండి గట్టెక్కడానికి అలా ఆపద్ధర్మంగా అబద్దం ఆడవలసి వచ్చింది), మళ్ళీ గొర్రె చచ్చింది, ఈ సారి 57 వచ్చేసాయి. తను ఈ విషయం గుర్తించి అవహేళనగా ఒక విచిత్రమైన నవ్వు నవ్వి, వేరే చర్చలోకి దింపేసాడు. అయినా నాలో ఏదో తెలియని వెలితి. ఇంటికి వచ్చి ఇంటర్నెట్లో రెండు గంటలు వెచ్చించి మరీ వెతికాను. గల్లంతయిన రెండు అక్షరాలు కనపడకపోగా విచిత్ర సమాధానాలతో వింత వింత చర్చలు కనిపించాయి. లాభం లేదనుకొని మా నాన్నగారికి టెలిఫోన్ చేసి అడిగాను , మా నాన్నగారు ఇటువంటి అనుభవం తనకూ జరిగిందని తన అనుభవాన్ని కలిపి, ఒక కథతో పాటు ఒక అక్షరాన్ని జోడించారు. అదే తమిళులు వాడుకునే zha(: Unicode 0C34). ఆ అనుభవాన్ని, అక్షరాన్ని గురించి తరువాతి బ్లాగులో మీతో పాలుపంచుకుంటాను. అంతవరకూ మీరూ తప్పిపోయిన యాభైఆరవ అక్షరాన్ని వెతుకుతూ కనపడితే కింద వాఖ్య రాసి పుణ్యాన్ని మూట కట్టుకోండి.
Related Posts Plugin for WordPress, Blogger...