మొదటిసారిగా తెలుగు గడ్డని వదిలి బయటకు వచ్చే ప్రతిఒక్కరికీ ఎదురయ్యే సంఘటనలలో ఇది ఒకటి.
ఆంగ్ల భాషా ఉచ్చారణలో మాతృభాషా ప్రభావం ప్రతిఒక్కరికీ ఉంటుంది. అదే విధంగా తెలుగు వారికి కూడా కొన్ని అక్షరాల ఉచ్చారణలో ఈ ప్రభావం కనిపిస్తుంది. నేను మొదటిసారి ఉత్తరాది వారితో మాట్లాడేటప్పుడు, వారికి నా H ఉచ్చారణవింతగా అనిపించేది. సాధారణంగా మనకు ఆంగ్ల వర్ణమాల నేర్పించేటప్పుడు ఈ క్రింది అక్షరాలను తప్పుగా నేర్పిస్తారు.( ఇప్పటి కేంద్రీయ,అంతర్జాతీయ విద్యాలయాలలో విద్యా విధానంలో మార్పులు వచ్చాయి. ఇది కేవలం సాధారణ విద్యాలయాలను ఉదహరించి మాత్రమే).
H ని హెచ్ అని పలుకుతాము కాని ఇది ఎయ్చ్ అని పలకాలి. అసలు ఉచ్చారణలో హ రూపమే కనపడదు. కానీ మరో అక్షరంతో కూడి పదంగా మారినప్పుడు దాగివున్న 'హ ' శబ్దం తన ఉనికిని చూపిస్తుంది. ఉదాహరణకు HR ని ఎయ్చ్ ఆర్ అని పలకాలి, కాని Hat ని హాట్ అనే పలకాలి.
L, M, N ఈ మూడింటిని చాలామంది వరుసగా యం యల్, యన్ అని పలుకుతారు, కాని వీటిని ఎం, ఎల్, ఎన్ అని పలకాలి. ఉదాహరణకు HTML ని ఎయ్చ్ టి ఎం ఎల్ అని పలకాలి.
ఇక నా అనుభవానికి వస్తే, మొదటిసారి నాకీ అనుభవం ఎదురయినప్పుడు, నేను నమ్మలేకపోయాను. నాకొక గట్టినమ్మకం ఏమంటే రెండు ఉచ్చారణలూ సరైన ఉచ్చారణలు కావచ్చునని. అటకమీద పడిఉన్న ఒక పాత నిఘంటువుని తీసి వెతుకులాట మొదలుపెట్టాను. నా గట్టి నమ్మకానికి తిలోదకాలు ఇచ్చుకోవలసి వచ్చింది. నిజమే అతగాని పలుకుబడే నిజం, ఇది హెచ్ కాదు, ఎయ్చ్. ఆ చేదు నిజాన్ని జీర్ణించుకోలేక పోయాను కారణం ఈ విషయం నాకు మూడుపదుల వయసులో తెలియడమే. నాకు చదువు చెప్పిన టీచరయ్యలని, టీచరమ్మలని ఎదురు నిలబెట్టి కడిగెయ్యాలన్నంత కోపం. అసలు ఈ విషయం గురించి గూగులు మహా తల్లి ఏం చెబుతుందో చూద్దామని వెతికాను. దొరికింది, ఇది కేవలం మన తెలుగు వారి బాధ కాదు, దక్షినాదివారంతా అనుభవించేదే, ఆ మాటికొస్తే ఫ్రాన్సు, మెక్సికో, ఇటలీ, దక్షిణమెరికా, ఆఫ్రిక, జెర్మను దేశాలలోని కొంతమంది ప్రజలు ఇలానే పలుకుతారట. 'హెచ్ ' ఉచ్చారణలో తప్పులేకపోయినప్పటికీ, 'ఎయ్చ్ ' అనిపలకటమే ఉత్తమమని తెలిసింది.
ఆంగ్ల పదాల ఉచ్చారణలో కూడా కొన్ని అనుభవాలను ఒక్కొక్కటిగా తరువాతి పోస్టులలో మీతో పంచుకుంటాను.
No comments:
Post a Comment